తొర్రూరు : లాక్ డౌన్ ( Lockdown) నేపథ్యంలో దేశానికి ఆర్థిక స్వావలంబన అందించి అభివృద్ధిని పరుగులెత్తించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ( Economic package ) తెలంగాణ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కార్ అందించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీపై ( Atma Nirbhar package ) ఓ దిక్కుమాలిన ప్యాకేజీ అంటూ మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కుద‌వపెడితే అప్పులిస్తామ‌ని చెప్పిన బీజెపి ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఓ దిక్కుమాలిన ప్యాకేజీని ఇచ్చింద‌ని మండిపడ్డారు. అర్థం ప‌ర్థం లేని ఆంక్ష‌లు పెట్టి, రాష్ట్రాలు దివాలా తీసే విధంగా నిబంధ‌న‌లు పెట్టి ఇచ్చేదానిని ఓ ప్యాకేజీ అంటారా ? అదో బొంద ప్యాకేజీ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదేం ఫెడ‌ర‌లిజం ?:
క‌రోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత క‌ష్ట కాలంలో కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాల్సిందిపోయి, రాష్ట్రాలను అధఃపాతాళానికి తొక్కాల‌ని చూడ‌టం ఏ విధ‌మైన ఫెడ‌ర‌లిజం ( Federalism ) అనిపించుకుంటుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Telangana CM KCR ) నేతృత్వంలో క‌రోనాని ఎదుర్కొంటున్నామ‌న్నారు. అంద‌రికంటే ముందే లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనాని క‌ట్ట‌డి చేశామ‌న్నారు. సీఎం కేసీఆర్ ఆర్థికంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాల‌ను ఆదుకోవ‌డానికి అనేక దారులు చూపార‌ని, అందులో ఏ ఒక్క‌టీ ప‌రిశీలించ‌కుండానే, ఓ నియంతృత్వ ప‌ద్ధ‌తిలో ప్యాకేజీని ప్ర‌క‌టించింద‌ని మండి ప‌డ్డారు. 


రైతులకు కూడా న్యాయం జరగడంలేదు:
బిజెపి ( BJP ), కాంగ్రెస్ ( Congress) పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల పంట‌లను కనీసం కొనే దిక్కులేదు. రైతుల పంటలకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కూడా ల‌భించ‌డం లేద‌ని ఆరోపించిన మంత్రి ఎర్రబెల్లి... అందుకే తెలంగాణకు ఆనుకుని ఉన్న ప‌క్క రాష్ట్రాల రైతులు వారి ధాన్యాన్ని మ‌న రాష్ట్రంలో అమ్ముకుంటున్నారని అన్నారు. ఇప్ప‌టికైనా కేంద్రం రాష్ట్రాల‌ను ఆదుకునే విధంగా ఆలోచించాల‌ని, రాష్ట్రాలన్నీ క‌లిస్తేనే దేశ‌మ‌వుతుందనే సంగ‌తిని కేంద్రం మ‌ర‌వ‌వ‌ద్ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన బీజేపి నేతలు ( BJP leaders in Telangana ).. తాజాగా మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.