Bandi Sanjay About Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావించిన బండి సంజయ్.. బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు తగ్గలేదు అని అన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే 36 శాతం ఓట్లు వచ్చాయి. సీట్లు మాత్రమే తగ్గాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి గతంలో 38 శాతం ఓట్లు 80 సీట్లు వస్తే... ఈసారి 43 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుంది. గతంలో 20 శాతం ఓట్లు తెచ్చుకున్న జేడీఎస్ ఈసారి 13 శాతానికే పరిమితమయ్యాయి. జేడీఎస్ పార్టీకి చేజారిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి తప్ప భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు ఏ మాత్రం తగ్గలేదు అని కర్ణాటక ఎన్నికల ఫలితాల గణాంకాలను తనదైన శైలిలో విశ్లేషించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. "మత రాజకీయాలు చేసిన పార్టీ కాంగ్రెస్సే. ఒక వర్గం ఓట్లన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ కే పడేలా చేశారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం స్వయంగా ఒక వర్గం ఓట్లు చీలితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసి.. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడేలా చేశారు. ఎంఐఎం పార్టీతో పాటు నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఎన్డీపీఐ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశాయి. బీజేపీని బూచిగా చూపి ఓట్లు దండుకున్న పార్టీ కాంగ్రెస్సే. హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హేళన చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసింది అని అన్నారు.


కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో చెల్లుబాటు కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం తథ్యం. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ఎంపీ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచాం. జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచుకున్నాం. తెలంగాణలో ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పనిచేస్తాయి. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మనుషులు కలిసే ఉన్నారు. కర్ణాటకలో మనసులు కలిశాయి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి షాడో మిత్రుడు.... తెలంగాణలో కలిసే పనిచేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు అని బండి సంజయ్ గుర్తుచేశారు. 


కేసీఆర్ ప్రమేయంతోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక క్యాంపు రాజకీయాలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు యత్నించింది. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించడం ఖాయం. కుహానా లౌకిక వాద పార్టీలన్నీ ఏకమైనా తెలంగాణలో బీజేపీ గెలుపును అడ్డుకోలేరు. దమ్ముంటే భజరంగ్ దళ్ సంస్థను నిషేధించమని చెప్పగలరా ? పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తామని చెప్పే దమ్ముందా కేసీఆర్ కు? అని బండి సంజయ్ సవాల్ చేశారు. తెలంగాణలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రం అప్పులపాలైంది. ఉద్యోగాలకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అభివృద్ది సాధ్యం అవుతుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు.