TSPSC Paper Leakage Case: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంపై కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి ఈ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాసిన లేఖనే ఒక చక్కటి ఉదాహరణ అని బండి సంజయ్ పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అని మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ కు వచ్చిన వారిపై పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్ నుంచే తన పాలన కొనసాగిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్ తీరుతెన్నులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు.  


కుటుంబమే పరమావధిగా వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యే సరికి అకస్మాత్తుగా కార్యకర్తలపైన ప్రేమ పుట్టుకొచ్చిందని... టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొడుకు కేటీఆర్.., ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోవడంతోపాటు అనేక స్కాముల్లో పాలుపంచుకుందనడానికి రుజువులు దొరుకుతుండటంతో తన కుటుంబం అవినీతిపై చర్చ జరగకుండా మరోసారి కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది అని బండి సంజయ్ ఆరోపించారు.


ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్  విద్యార్థుల మరణాల కు కారణమైన ఐటీ స్కాం,  ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక  కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడు. 


ఆనాడు కార్యకర్తల, ఉద్యమకారుల త్యాగాలు, శ్రమతో ఏర్పడిన తెలంగాణను తన స్వార్ధం కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రశ్నించిన ఉద్యమకారులను, నాయకులను బయటకు పంపిన చరిత్ర కేసీఆర్ ది. తన అధికారాన్ని కాపాడుకునేందుకు తెలంగాణను అవమానించిన వాళ్లను, అవినీతిపరులను చేరదీసి అందలమెక్కించిన విషయాన్ని మర్చిపోగలమా? 9 ఏళ్లలో సామాన్య ప్రజల సంగతి దేవుడెరుగు... ఏనాడైనా కార్యకర్తలను పిలిచి కేసీఆర్ బువ్వపెట్టారా?  ప్రగతి భవన్ కు వచ్చిన వాళ్లను లాఠీలతో కాళ్లు విరగ్గొట్టించిన కేసీఆర్ వేల కోట్లు సంపాదించి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అటుకుల బుక్కి తెలంగాణ కోసం కొట్లాడామంటూ లేఖ రాయడం హాస్యాస్పదం.


1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని, ఎందరో తెలంగాణ ఉద్యమకారుల రక్తం చిందించి తెలంగాణ తెస్తే నీళ్లు-  నిధులు- నియామకాలన్నీ తన కుటుంబానికే సొంతం చేసుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా నట్టేట ముంచింది. దగాపడ్డ తెలంగాణ ప్రజలారా.... బీఆర్ఎస్ కార్యకర్తలారా... ఇప్పటికైనా మేల్కొనండి. ఒకసారి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయాం. ఇప్పటికే ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ కొట్టుమిట్టాడుతోంది.  విద్య, వైద్యం అందక సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రం నిధులిస్తున్నా దారి మళ్లిస్తూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తిరిగి కేంద్రంపై బురదచల్లే నీచమైన కుట్రలకు కేసీఆర్ తెరదీశారు.


గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఈ నక్కజిత్తుల కేసీఆర్ మాటలను నమ్మితే నట్టేట మునిగిపోతాం. తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టేందుకు సిద్ధమవ్వండి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటాలకు మద్దతు పలకండి. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. పంట నష్టపోయిన రైతులందరికీ ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందిస్తాం. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం అంటూ బండి సంజయ్ హామీల వర్షం కురిపించారు.


ఇది కూడా చదవండి : TPCC Chief Revanth Reddy: పోచారం కుటుంబసభ్యులు ఓ దండుపాళ్యం ముఠా సభ్యులు


ఇది కూడా చదవండి : Heavy Rains Alert Telugu States: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK