Telangana Elections: అసెంబ్లీ రద్దు ఎప్పుడు? కేసీఆర్ ప్లాన్ మారిందా?
Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. 2018 తరహాలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే అంచనాతోనే విపక్షాలు దూకుడు పెంచాయి.
Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. 2018 తరహాలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే అంచనాతోనే విపక్షాలు దూకుడు పెంచాయి. తెలంగాణలో పర్యటించిన కేంద్రం పెద్దలు, మంత్రులు కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ తమ కేడర్ ను అప్రమత్తం చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ కూడా ప్రగతిభవన్, ఫాంహౌజ్ ను వీడి జోరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. కలెక్టరేట్లు, పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అటు ప్రశాంత్ కిశోర్ టీమ్ టీఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారని విపక్షాలు సహా జనాలు కూడా భావించారు. దసరా రోజున కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అక్టోబర్ లేదా ననంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి.. మార్చిలో జరిగే కర్ణాటక అసెంబ్లీతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగేలా కేసీఆర్ స్కెచ్ వేశారని చర్చలు జరిగాయి.
అయితే ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ ప్లాన్ మారిందా? ఆయన వ్యూహాం మార్చారా? అన్న చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ రద్దు విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని, ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ రద్దు విషయంలో సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ రద్దు చేయాలనే నిర్ణయంపై కేసీఆర్ వెనక్కి తగ్గారని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో మీడియాతో మాట్లాడిన సంజయ్.. తన మిత్రుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీ రద్దు విషయంలో కేసీఆర్ కు కొన్ని సూచనలు చేశారని అన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు రావని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెడుతుందని నితీశ్ చెప్పారట. నితీష్ మాటతో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని సంజయ్ కామెంట్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ చేశారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. మోడీని, కేంద్రాన్ని తిట్టడానికే అసెంబ్లీ నిర్వహించారని అన్నారు.
అసెంబ్లీ రద్దు విషయంలో బండి సంజయ్ చేసిన తాజా కామెంట్లు హాట్ హాట్ గా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2023 డిసెంబర్ వరకు గడువుంది. నవంబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తే వచ్చే ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఏడాది అంటే 2023 మే వరకు అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువుకు ఆరు నెలల ముందు వరకు ఎన్నికలు జరపాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఆ సమయంలో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ లెక్క ప్రకారమే అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధిస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ వెనక్కి తగ్గారని అంటున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పారు బండి సంజయ్.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనూ తన ప్రసంగంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి హింట్ ఇచ్చారు కేసీఆర్. వర్షాకాల సమావేశాలను మూడు రోజులు నిర్వహించింది ప్రభుత్వం. అయితే సభలో మాట్లాడిన కేసీఆర్.. శీతాకాల సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహిస్తానని చెప్పారు. దీంతో అసెంబ్లీ రద్దు ఉండదనే సంకేతం కేసీఆర్ ఇచ్చారని అంటున్నారు.
Read also: సరికొత్తగా ప్రమోషన్స్.. రాజకీయాల మాదిరి పాదయాత్ర మొదలెట్టిన హీరో నాగశౌర్య! ఇదే మొదటిసారి
Read also: Medicines Banned: జింటాక్, ర్యాంటాక్ మందులతో కేన్సర్, 26 మందుల్ని నిషేధించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook