Bandi Sanjay About Raja Singh: రాజాసింగ్ విడుదల.. బీజేపి సస్పెన్షన్ ఎత్తివేస్తుందా ? స్పందించిన బండి సంజయ్
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay About Raja Singh: బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ పై నమోదైన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడంతో ఆయన బుధవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో ప్రొఫెట్ మహ్మద్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో జైలుకి వెళ్లిన నేపథ్యంలో బీజేపి అప్పట్లో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కూడా సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాజాసింగ్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ రాజా సింగ్ అంశం గురించి స్పందించారు.
రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని బండి సంజయ్ గుర్తుచేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం బిజెపి కార్యకర్తలపై, సామాన్య ప్రజలపై అక్రమంగా, అకారణంగా పీడీ యాక్ట్ పెట్టి చిత్రహింసలకు గురిచేస్తోంది అని అన్నారు. రాజా సింగ్ పై పీడీ యాక్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ విధించిన సస్పెన్షన్ విషయాన్ని కేంద్ర కమిటీ చూసుకుంటుంది అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తల్లి మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న పొత్తు మునుగోడు ఉప ఎన్నికలో బయటపడింది అని బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించారని.. అక్కడే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు బట్టబయలైందని అన్నారు.