Bharat biotech: మలేరియాకు భారత్ బయోటెక్ టీకా..జీఎస్‌కే భాగస్వామ్యంతో ఉత్పత్తి
Bharat biotech malaria vaccine: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మలేరియాటీకా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్‌కే భాగస్వామ్యంతో ఈ టీకాను అందించనుంది.
Bharat biotech malaria vaccine: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మలేరియాటీకా ఉత్పత్తి చేయనుంది. అగ్రశ్రేణి ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే)తో కలిసి ఈ టీకాను అందించనుంది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ హెడ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) డాక్టర్ రేచస్ ఎల్ల ‘ట్విటర్’లో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తొలి మలేరియా టీకా ఇదే కావడం గమనార్హం.
WHO అనుమతి
జీఎస్‌కే అభివృద్ధి చేసిన ‘ఆర్‌టీఎస్, ఎస్’ మలేరియా టీకాను సబ్-సహారన్ (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) ఆఫ్రికా దేశాలతో పాటు, మలేరియా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాల్లో చేపట్టే టీకాల కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని జీఎస్‌కే ఆహ్వానిస్తూ, భారత్ బయోటెక్‌తో కలిసి టీకా ఉత్పత్తి చేపట్టనున్నట్లు, 2028 వరకూ ఏటా 1.5 కోట్ల డోసుల టీకా అందించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్‌కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. మలేరియా టీకా(malaria vaccine) ఉత్పత్తికి ఈ ఏడాది జనవరిలో జీఎస్‌కే, భారత్ బయోటెక్, పాథ్ (ఆరోగ్య సేవల్లో నిమగ్నమై ఉన్న ప్రపంచస్థాయి స్వచ్ఛంద సంస్థ)లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Also read: Nagaon Central Jail: 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్, అస్సాంలో ఘటన
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అనుమతి వచ్చిన తర్వాత జీఎస్‌కే నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని భారత్ బయోటెక్ టీకా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదిరింది. దీన్ని ఇప్పుడు కార్యాచరణలోకి తీసుకురానున్నారు. మలేరియా టీకాపై ఆఫ్రికా దేశాలైన ఘనా, కెన్యా, మలావిలలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించారు. దాదాపు 8 లక్షల మంది పిల్లలకు కనీసం ఒక డోసు టీకా ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా దీన్ని విస్తృత స్థాయిలో వినియోగించటానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి చేపట్టేందుకు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook