హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 2018 ఎన్నికలు ఈసారి మరింత రక్తి కట్టించనున్నట్టు తెలుస్తోంది. పాత బస్తీలో ఎంఐఎం పార్టీలో కీలక నేత అయిన అక్బరుద్దీన్ ఓవైసీపై బీజేపీ ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడమే అందుకు కారణంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బీజేపీ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీలో మహిళా నేతగా ఎదిగిన సయ్యద్ షాహెజాదికి ఎంఐఎం తరపున చాంద్రాయణగుట్ట నుంచి గత ఎన్నికల్లో గెలిచిన అక్బరుద్దీన్‌పై పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది బీజేపీ.


1999 నుంచి 2004, 2009, 2014 వరకు వరుసగా ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోన్న అక్బరుద్దీన్ ఇటీవల రద్దు చేసిన తెలంగాణ అసెంబ్లీకి ఎంఐఎం పార్టీ పక్ష నేతగా వ్యవహరించారు. తమపై మహామహులను బరిలోకి దించాల్సిందిగా గతంలోనే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ రాజకీయ ప్రత్యర్ధులకు సవాల్ విసరగా.. బీజేపీ ఇప్పుడు ఇలా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ యువ మహిళా నేతను బరిలోకి దింపడం చర్చనియాంశమైంది.