హైదరాబాద్: రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, ఆ తర్వాత తమ పార్టీ హైదరాబాద్ పేరును కూడా మార్చి భాగ్యనగర్ అని పెడతాం అని ప్రకటించారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హైదరాబాద్ లోని గోషా మహల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ నియోజకవర్గం నుంచే గత ఎన్నికల్లో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన బీజేపీ నేత రాజాసింగ్ సైతం గత నెలలో ఇటువంటి ప్రకటనే చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే, హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చేస్తామని నెల రోజుల క్రితం జరిగిన ఓ ప్రచార సభలో రాజా సింగ్ స్పష్టంచేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం అదే ప్రకటించి శతాబ్ధాల చరిత్ర కలిగిన హైదరాబాద్ పట్ల తమ పార్టీ విధానాన్ని చాటుకున్నారు. 


ఇదిలావుంటే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకొస్తే, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని తెలంగాణ నుంచి తరిమికొడతాం అని ఆదివారం నాటి ఎన్నికల ప్రచార సభలో యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. యోగి ఆదిత్యనాథ్ ప్రకటనపై ఓవైసీ సైతం అంతే ఘాటుగా స్పందించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్న బీజేపీ నేతలు తనను ఏమీ చేయలేరని ఓవైసీ బదులిచ్చారు.