తెలుగు రచయితల కోసం వినూత్న ప్రయత్నం
తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు సాహిత్యాభిమాని మరియు ఆదిలాబాద్‌లోని మంచిర్యాల వాస్తవ్యులు శ్రీ బొడ్డు మహేందర్ ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 15 నుండి 19వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులో జరగనున్నాయి. ఈ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు సాహిత్యాభిమాని మరియు ఆదిలాబాద్‌లోని మంచిర్యాల వాస్తవ్యులు శ్రీ బొడ్డు మహేందర్ ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రచయితలు, కవుల వివరాలను సేకరించి "దుర్బిణి" పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించనున్నారు.
తెలుగు రచయితల డేటాబేస్‌గా ఈ పుస్తకాన్ని భావించవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. "ప్రపంచ తెలుగు కవులు-రచయితల డైరెక్టరీ" అనే ఉపశీర్షికతో వెలువరించబోయే ఈ పుస్తకాన్ని జిల్లా, రాష్ట్రం, దేశం అనే హద్దులు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు,రచయితల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు నెలకొనడానికి, సాహిత్య సాంస్కృతిక సంస్థలు పటిష్టం అవడానికి, ముఖ్యంగా సాహితీ పరిశోధకులకు ఒక మార్గ దర్శకంగా నిలవడానికి, చేస్తున్న బృహత్తర ప్రయత్నమే అని పుస్తక సంపాదకులు మహేందర్ తెలియజేశారు.