జనగామ జిల్లాలో ఓ వధువు, ఆమె ప్రియుడు దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి, తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను, అతడి కుటుంబాన్నే మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. వధువు ఇచ్చిన సూచనల మేరకు ఆమెను చేసుకోబోయే వరుడిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు ఆమె ప్రియుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వరుడు యాకయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు ముందస్తుగా రచించిన ఓ పథకం ప్రకారం కాబోయే భర్త యాకయ్యను ఇంట్లోంచి బయటికి రప్పించగా ఆమె పంపించిన ప్రియుడు, ప్రియుడి మనుషులు యాకయ్యపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు యాకయ్య సైతం జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పుకుని వాపోయాడు. బాధితుడు యాకయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జనగామ జిల్లా కంచనపల్లిలో ఈ నెల 18వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ పెళ్లి కుదిరిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు రెండుసార్లు యాకయ్య తండ్రి శామ్యూల్‌పై కూడా దాడి చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.