Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన 9 అంశాల ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖలో సోనియా గాంధీ ప్రస్తావించిన 9 అంశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం ఎందుకు లేదు అని కల్వకుంట్ల కవిత , సోనియా గాంధీని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీకు అంత ముఖ్యమైన అంశంగా కనిపించలేదా అని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ఎక్స్‌ ( గతంలో ట్విటర్ ) ద్వారా సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల అవలంభిస్తున్న వైఖరి ఏంటో ఈ లేఖతో స్పష్టం అవుతోంది అని కవిత అభిప్రాయపడ్డారు. 


ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కల్వకుంట్ల కవిత తీరుపై మండిపడుతున్నారు. " బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో మరి మీరు ఎందుకు మహిళలకు ప్రాధాన్యం కల్పించలేదో చెప్పాలి " అని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. " మీ చేతుల్లో ఉన్న పని మీరు చేయకుండా మరొకరిని తప్పుపట్టడం ఏంటి " అని కాంగ్రెస్ నేతలు కవితను నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన వెలువడిన తరువాత కవితను ట్రోల్ చేస్తూ అనేక సోషల్ మీడియా పోస్టులు సైతం దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే.