Harish Rao: `గ్యారంటీ`ల అమలుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెడలు వంచాలి: హరీశ్ రావు పిలుపు
Siddipet Thanks Meet: తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సిద్దిపేట నియోకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కృతజ్ణతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సత్తా చూపి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Harish Rao Fire on Congress Govt: సిద్దిపేట ఎమ్మెల్యేగా మరోసారి తనను గెలిపించిన ప్రజలకు మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకుడు హరీశ్ రావు కృతజ్ణతలు చెప్పుకున్నారు. తన విజయానికి కష్టపడిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 82 వేల భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ నిర్వహించగా ఆ సభలో హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. 'అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్లతో మాత్రమే ఓడిపోయాం. మరో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే మనమే అధికారంలోకి వచ్చేవాళ్లం. ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు' కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, మనది ఉద్యమ స్ఫూర్తి అని తెలిపారు. ఓటమికి కారణాలు వివరిస్తూ.. 'రైతు బంధు, రైతు బీమా పథకాలను అనుకున్నంత ప్రచారం చేయలేకపోయాం. మనం చేసిన మంచి పనులను చెప్పుకోవడంలో వెనకబడ్డాం' వివరించారు.
అధికారం కోల్పోయినా ఇప్పుడు మనముందు మరింత బాధ్యత ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు. 'కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. డిసెంబర్ 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ ఆ హామీ నిలబెట్టుకోలేదు' అని గుర్తుచేశారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
కాంగ్రెస్ హామీలపై నిలదీత
గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అన్నారు కానీ, బిల్లులు వస్తూనే ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. మరి బిల్లులు సోనియా గాంధీ కడతారా? కోమటిరెడ్డి కడతరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన మెగా డీఎస్సీ, వడ్లకు బోనస్, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తాము ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు.
'కాంగ్రెస్ హామీలను తప్పించేందుకు అప్పుల సాకు చూపుతోంది' అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులను కూడా చూపి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లంకెబిందెలు దొరకలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ దావోస్‌కు వెళ్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించిన రేవంత్ మరి దావోస్‌కు ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ వల్ల సాధ్యం కానిది కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. 'తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు.. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే' అని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మనం కష్టపడి గెలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి హామీలను అమలు చేయించాలంటే మన ఎంపీలను పార్లమెంటుకు పంపాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు లక్ష్యం నిర్దేశించారు.
Also Read: Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!
Also read: February New Rules: ఫిబ్రవరి నుంచి మారిపోతున్న రూల్స్, ఎన్‌పీఎస్, ఫాస్టాగ్, గోల్డ్ బాండ్‌లో మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook