RS Praveen Kumar: వాళ్లిచ్చే పది గొర్రెలు, బర్రెలు, దావత్‌లకు అమ్ముడుపోదామా ?
RS Praveen Kumar stands in support of Vatte Janaiah Yadav: 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
RS Praveen Kumar stands in support of Vatte Janaiah Yadav: ఓటమి భయంతో కాకపోతే మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతో బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నాడు అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నాడు ? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడో సమాధానం చెప్పాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా ? జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచేటోడా ? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలెనా అని మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశారు.
ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా ? లేక ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకే మంత్రి జగదీశ్ రెడ్డి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినందుకా ? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా ? బీసీ . ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా) మీకు చంచాలుగానే బతకాల్నా అని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నూటికి 99 % మంది ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా ? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా ? మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా ? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాల్నా అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలారా …
50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా అని బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అందుకే మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా.. తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్ - జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరూ గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె అని బహుజనులకు పిలుపునిచ్చారు. లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు తరలి రండి అంటూ పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము అని సవాల్ విసిరారు. పోలీసోల్లు సంపితే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి. దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.. అందుకోసం అందరూ ఏకమై రండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వట్టే జానయ్య యాదవ్ కి అండగా నిలుస్తూ ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చా రు.