హైదరాబాద్‌లోని ఆదర్శనగర్ ప్రాంతంలో గల హాకా భవన్‌లో తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బీమారావ్ లోకుర్ ఈ ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలికాలంలో చిన్నపిల్లలపై కూడా దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో.. అలాంటి కేసులలో బాధిత బాలలను విచారించడానికి పూర్తి వైవిధ్యమైన వాతావరణంతో.. పసి మనసులకు సాంత్వన కలిగించే పరిసరాలతో ఉండే కోర్టు నెలకొల్పితే బాగుంటుందని భావించి ఒక ప్రయోగం క్రింద ఈ న్యాయస్థానానికి రూపకల్పన చేశామని అధికారులు తెలిపారు.


పోస్కో  యాక్ట్ క్రింద కేసులు నమోదైనప్పుడు... బాధితులైన పిల్లలను ఇక నుండి హైదరాబాదులో ఇదే కోర్టులో విచారిస్తారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బీమారావ్ లోకుర్  మాట్లాడుతూ "ఇది నిజంగానే మంచి ఆలోచన. అయితే ఈ కోర్టుని పోలీస్ శాఖ వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అనుభవాల ద్వారానే మనం కొత్త పాఠాలు నేర్చుకోగలం" అని తెలిపారు. ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐజీ స్వాతి లక్రా, హైదరాబాద్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం జగదీశ్వర్ మొదలైన వారు పాల్గొన్నారు.