ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : స్పీకర్‌కి భట్టి లేఖ
ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : స్పీకర్‌కి భట్టి లేఖ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కి ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా భట్టి విక్రమార్క తన లేఖలో కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లేఖతో పాటు 125 పేజీల పిటిషన్ ప్రతులను స్పీకర్‌కి అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసిన సీఎం కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని భట్టి మండిపడ్డారు. స్పీకర్‌ని కలిసిన తాము.. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసి సభాధ్యక్షుడి హోదాలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
పార్టీ మారిన రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనామా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టు భట్టి మీడియాకు వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ త్వరలోనే మరో లేఖరాయనున్నట్టు భట్టి తెలిపారు.