నేడు తెలంగాణ కేబినెట్ భేటీ; కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పావులు వేగంగా కదులుతున్నాయి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పావులు వేగంగా కదులుతున్నాయి. నాలుగురోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి ఆదేశించారు. ప్రగతి భవన్‌లో జరిగే కేబినెట్ భేటీలో నాలుగు రోజుల హస్తిన పర్యటన వివరాలను సహచరులకు వివరించే అవకాశం ఉంది. అంతేకాక.. పెండింగ్, కొత్త ప్రతిపాదనలన్నింటినీ ఇవాళ జరిగే భేటీకి తీసుకురావాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఉత్తర్వులు వెళ్లాయని సమాచారం. మంగళవారం మంత్రిమండలి సమావేశంలో పాలనాపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు ఉంటాయని..అన్ని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించి తుదినిర్ణయం తీసుకుంటారని అధికారులు అంటున్నారు.
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు ముందస్తుపై స్పష్టతనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నూతన జోనల్ విధానంపై ప్రధాని అంగీకారం తెలపడం, వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ, సెప్టెంబన్ 2న జరిగే ప్రగతి నివేదన సభతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించనున్నారని తెలిసింది. మరోవైపు మంగళవారం జరిగే భేటీ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారని స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కేసీఆర్ నాలుగురోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీతో సమావేశమై కొత్త జోన్ల ఏర్పాటు, హైకోర్టు ఏర్పాటు, కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. కేసీఆర్ హస్తిన పర్యటన సక్సెస్ అయ్యిందని తెరాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.