Komatireddy: తెలంగాణ  కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉండగా... ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ లో కొంత కాలంగా వీళ్లిద్దరు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం దాదాపు ఏడాదిగా ఉంది. గతంలో ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతమైందంటూ కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌రెడ్డిని నియమించడాన్ని తప్పుపట్టారు. దొంగలకు పార్టీ పగ్గాలు ఇచ్చారంటూ బహిరంగంగానే మాట్లాడారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినా వెళ్లలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరుతారని భావించారు. కాని అది జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి పాల్గొనడం లేదు. బీజేపీలో చేరకపోవడం.. కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కోమటిరెడ్డి రాజకీయ గమనంపై ఆయన అనుచరులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమచారం ప్రకారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డ్ రాజగోపాల్ రెడ్డిపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. బుధవారం ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రహస్యంగా సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయని.. కోమటిరెడ్డి చేరికకు అమిత్ షా ముహుర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ పై అమిత్ షా భరోసా ఇచ్చారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ.. తన అనుచరులకు ప్రాధాన్యం వంటి అన్ని విషయాల్లో రాజగోపాల్ రెడ్డికి బీజేపీ పెద్దల నుంచి పూర్తి భరోసా వచ్చిందని అంటున్నారు. పార్టీలో చేరగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకురావాలని అమిత్ షా వ్యూహం రచించారని తెలుస్తోంది. బైపోల్ లో గెలవడం ద్వారా కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో పాటు.. ఆ విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బూస్ట్ గా ఉంటుందన్నది కమలనాథుల లెక్కగా చెబుతున్నారు.


రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. గత ఏడాదే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని డిసైడ్ అయినా బీజేపీ పెద్దలే ఆపేశారని తెలుస్తోంది. బీజేపీలో చేరితే రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు పడేది .. ఆ తర్వాత మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చేది. అయితే మునుగోడులో బీజేపీ బలం అంతంతమాత్రమే. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 10 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత కూడా బీజేపీ పెద్దగా బలపడింది లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదారు సీట్లతోనే సరిపెట్టుకుంది. అందుకే ఉప ఎన్నిక వస్తే మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించిన బీజేపీ పెద్దలు ఆయనచేరికను వాయిదా వేశారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపు తర్వాత కమలం జోరు మరింత పెరిగింది. తాజాగా మునుగోడు నియోజకవర్గంలోనూ బీజేపీ సర్వే చేయించిందని తెలుస్తోంది. కొద్దిగా కష్టపడితే గెలుపు సాధించవచ్చని అందులో వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.


ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఆగస్టు 30 లోపు రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తర్వాత మూడు, నాలుగు నెలల్లోనే ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఏడాది చివరలో కర్ణాటక అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు మునుగోడు ఉపఎన్నిక జరిగేలా బీజేపీ పెద్దలు స్కెచ్ వేశారని అంటున్నారు. ఉప ఎన్నికలో అన్ని విధాలా సహకరిస్తామని రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా హామీ ఇచ్చారని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి 22 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. నియోజకవర్గంలో ఆయన అనుచరగణం భారీగా ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ కూడా బలపడింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ తరహాలో  బూత్ స్థాయి నుంచి పార్టీ నేతలను మోహరించి, అన్ని రకాలుగా ఓటర్లను ప్రభావితం చేసి మునుగోడులో గెలిచేలా అమిత్ షా వ్యూహం రచించారని తెలుస్తోంది. 


కోమటిరెడ్డి రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఖాళీ అవుతుందని అంటున్నారు. ఆ పార్టీలో మరో బలమైన నేత లేడు. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో కాంగ్రెస్ పోటీలో కూడా ఉండే పరిస్థితే లేదంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే కోరుకుంటున్న కమలం పార్టీ కోమటిరెడ్డితో కొత్త గేమ్ మొదలుపెట్టబోతుందని.. అటు కేసీఆర్ కు సవాల్ విసరడంతో పాటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా అమిత్ షా వ్యూహం సిద్ధమైందని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే తెలంగాణలో తమకు అధికారం ఖాయమనే ధీమాలో కమలనాథులు ఉన్నారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే జరిగే మునుగోడులో ఓడిపోతే తమకు గండమని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్లాన్ చేస్తారనే భావనలో బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే... ఉప ఎన్నిక వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇలా అన్ని విధాలా పక్కాగా పరిశీలన చేశాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  తెలంగాణలో సరికొత్త ఆట మొదలుపెట్టేందుకు బీజేపీ అగ్రనాయకత్వం పక్కాగా ప్లాన్ గీసిందని తెలుస్తోంది.  


Also Read: Droupadi Murmu: బీజేపీ చాణక్యం ముందు విపక్ష కూటమి బోల్తా.. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్...


Also Read: India Presidents:ద్రౌపది ముర్ముకు 64 శాతం ఓట్లు... ఎక్కువ ఓట్లతో రాష్ట్రపతిగా గెలిచిందో ఎవరో తెలుసా?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook