Telangana Politics: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలోకి వస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెబుతుండగా.. రాజగోపాల్ రెడ్డి తమతోనే ఉంటారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క చెబుతున్నారు. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రకటనలతో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం సాగుతోంది. అటు రాజగోపాల్ రెడ్డి మాత్రం కేసీఆర్ పై యుద్దం చేస్తానని చెబుతూనే.. పార్టీ మార్పు, రాజీనామాపై పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కోమటిరెడ్డి చుట్టూనే తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో సోమవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారు. ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మెన్, సీనియర్ నేత జానారెడ్డి, పార్టీ కార్యదర్శి బోసురాజులు హైకమాండ్ పిలుపుతో హస్తినకు వెళ్లారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధుయాష్కీతో పాటు మరికొందరు నేతలు ఢిల్లీకి వెళుతున్నారని తెలుస్తోంది. హైకమాండ్ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది.ఆయన విషయంలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.


పార్టీ హైకమాండ్ ఆదేశాలతో శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి. ఈ చర్చల సారాంశాన్ని హైకమాండ్ కు వాళ్లు నివేదించనున్నారు. ఢిల్లీకి రావాలని రాహుల్ మాటగా ఉత్తమ్ చెప్పగా.. రాజగోపాల్ రెడ్డి తిరస్కరించారనే వార్తలు వచ్చాయి. తాను ఢిల్లీకి వచ్చేది లేదని ఉత్తమ్ కు కోమటిరెడ్డి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఢిల్లీకి రావాలని.. ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుందామని చెప్పారు. దిగ్విజయ్ పిలిచినా ఢిల్లీకి వెళ్లలేదు కోమటిరెడ్డి. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. ఇక బుజ్జగింపులు చేయాల్సిన పని లేదని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సాయంత్రం జరిగే సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సస్పెన్షన్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు.


గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. ఆ సమావేశానికి ఎంపీ వెంకట్ రెడ్డికి ఆహ్వానం ఉన్నా జ్వరం సాకుతో ఆయన వెళ్లలేదు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించాలని నిర్ణయించి ఆ బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. హైకమాండ్ ఆదేశాలతో శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి చర్చలు జరిపారు. ఉత్తమ్ తో సమావేశం తర్వాత మీడియోతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. మరోసారి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా బీజేపీని ఆకాశానికెత్తారు.


Read also: CWG 2022: భారత దేశం గర్వపడేలా చేశాడు.. వెయిట్‌లిఫ్టర్ షూలిపై ప్రధాని ప్రశంసలు!


Read also: Telangana Politics: పొంగులేటి వేడుకలో కమలం నేతల సందడి.. కనిపించని కారు పార్టీ ముఖ్య నేతలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook