కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌కి సవాల్‌ విసిరారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి..రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తే తాను గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని అసెంబ్లీలో తాను అనలేదని అన్నారు. కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, అందుకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను అనని మాటలు అన్నానని కేసీఆర్‌ చెప్పడం దారుణమని.. ఆయనొకసారి (కేసీఆర్‌) ఆత్మ విమర్శ చేసుకోవాలని జానారెడ్డి విమర్శించారు.


ఆధారాలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జానారెడ్డి కేసీఆర్‌కి సవాల్‌ విసిరారు. ఆధారాలు నిరూపించక పోతే.. కేసీఆర్‌ క్షమాపణలు చెప్తారా? అని ఆయన ప్రశ్నించారు.


శుక్రవారం జరిగిన హుస్నాబాద్‌ సభలో కేసీఆర్.. జానారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే.. తానే గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని జానారెడ్డి శాసనసభలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.