Congress MLA Jaggareddy likely to quit Party: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. శనివారం (ఫిబ్రవరి 19) రాజీనామా ప్రకటించే యోచనలో ఉన్నారు. రాజీనామాపై ఇప్పటికే తన ముఖ్య అనుచరులు, జిల్లా కార్యకర్తలకు జగ్గారెడ్డి సమాచారమిచ్చారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో పార్టీని వీడేందుకు దారితీస్తున్న పరిస్థితులను వారికి వివరించినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీ కోసం ఎంతగా పనిచేస్తున్నా.. ఒక వర్గం తనపై కోవర్టు ముద్రను వేస్తోందని జగ్గారెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ పార్టీ కార్యాచరణపై కనీస సమాచారం ఇవ్వట్లేదని.. ఇది తనను అవమానించడమేనని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలను సహించలేనని.. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నానని జగ్గారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.


జగ్గారెడ్డికి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ముందు నుంచి ఏమాత్రం పొసగట్లేదనే విషయం తెలిసిందే. జగ్గారెడ్డే కాదు పార్టీలోని పలువురు సీనియర్లు సైతం అడపాదడపా రేవంత్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో జగ్గారెడ్డి ఇంకాస్త దూకుడుగా ఉన్నారు. పలుమార్లు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. రేవంత్ వర్గమే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందనే అనుమానాలను వెలిబుచ్చారు. గతంలో జహీరాబాద్, గజ్వేల్‌లో తలపెట్టిన పార్టీ కార్యక్రమాలకు తనకు సమాచారమివ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 


రెండు రోజుల క్రితం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకత్వం ఇచ్చిన నిరసన పిలుపును కూడా జగ్గారెడ్డి వ్యతిరేకించారు. పార్టీ కార్యాచరణపై తనకు సమాచారం ఇవ్వలేదని.. అయినా పుట్టినరోజు నాడు నిరసనలు చేపడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారించారు. రోజురోజుకు ఆ అసంతృప్తి ఎక్కువవడం... పార్టీ నాయకత్వం తనను సంప్రదించే ప్రయత్నం చేయకపోవడంతో.. ఇక పార్టీని వీడటమే బెటర్ అని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్‌కి రాజీనామా నేపథ్యంలో జగ్గారెడ్డి తదుపరి అడుగులు ఎటువైపు అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఓసారి కాంగ్రెస్‌ను వీడి కొంతకాలానికే తిరిగి సొంత గూటికి చేరారు జగ్గారెడ్డి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డి.. ప్రస్తుతం అదే పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పట్ల ఆయన సాఫ్ట్‌గా వ్యవహరిస్తుండటం.. విమర్శల దూకుడు తగ్గించడం ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు. 


Also Read: Todays Horoscope 19th Feb 2022: ఈ రాశివారి నేటి జాతకం ఇలా ఉంటుంది, ఆ రాశివారికి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook