తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎలాగైనా విజయం సాధించి తీరుతామని మొదటి నుంచి ధీమా వ్యక్తంచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రచారంలోనూ కేసీఆర్‌పై ఘాటైన ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే నేడు పీపుల్స్ చార్జ్‌షీట్ అంటూ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జెవాలా... కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతితో కూడిన కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ అని అభివర్ణించారు. నాలుగేళ్ల మూడు నెలల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి అధికారంలో కూరుకుపోయిందని అన్నారు.


ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన సుర్జెవాలా.. అధికార దాహంతో ఉన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి మరీ అధికారంలోకొచ్చారని ఆరోపించారు. టీపీసీసీ కార్యవర్గ నేతల ఆధ్వర్యంలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగినట్టు తెలుస్తోంది.