Target BRS: బీఆర్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేసిన కాంగ్రెస్
Target BRS: రేవంత్ సర్కార్ దగ్గర బీఆర్ఎస్ నేతల హిట్ లిస్ట్ రెడీ అయ్యిందా..! కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కేసులో విచారణ తుదిదశకు చేరుకుందా..! అటు విద్యుత్ కొనుగోళ్ల అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు కటాకటాల వెనక్కి వెళ్లాల్సిందేనా.. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పకనే చెప్పేశారా..! ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో జైలుకు వెళ్లే పెద్ద తలకాయలు ఎవరివి..!
Target BRS: తెలంగాణలో పాలిటిక్స్ కాకపుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తుంటే అంతేదీటుగా అధికార పార్టీ తిప్పి కొడుతోంది. అంతేకాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ అనేక కమిషన్లు వేసి విచారణ జరుపుతోంది. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్ అంశాలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ కమిషన్ల నివేదికలను ఎప్పుడు వస్తాయా అని అత్రుతతో ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
తాజాగా తెలంగాణకు చెందిన మంత్రుల బృందం సియోల్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్రంలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన నేతలపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించిన వివాదాల్లో వారిపై ఆధారాలతో సహ ఫైళ్లు సిద్ధమయ్యాయన్నారు. సియోల్ నుంచి హైదరాబాద్ కు చేరేసరికల్లా ఆ నాయకులపై చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి పొంగులేటి. ఈ కేసులో 8 మంది మాజీ మంత్రులపై తప్పక చర్యలుంటాయని ఆరోపించడం సంచలనం రేపింది.
అయితే మంత్రి పొంగులేటి కామెంట్స్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్ పట్టుకుందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ మాజీ మంత్రి ప్రధాన భూమిక పోషించారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ధరణి ఫోర్టల్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ధరణి పోర్టల్ ద్వారా అప్పటి బీఆర్‌ఎస్ నేతలు భారీ మొత్తంలో ప్రభుత్వ భూములు దోచుకున్నారని ఆరోపణలున్నాయి. ఇందులో ఓ మాజీమంత్రి భూములన్నీ అన్యాక్రాంతం చేశారని విమర్శలున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరుగుతోంది. వీటికి తోడు విద్యుత్ కొనుగోళ్లలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే రకరకాల విచారణాలన్నీ కీలక దశలోఉన్నందుకే మంత్రి పొంగులేటి చెప్పకనే చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసుల్లో పెద్ద తలకాయలు జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి లోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్న చెబుతాడేమో? అన్నారు. ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి..? ఎన్ని కట్టల పాములు దొరికినయన్నది చెబుతాడా? అని ఎద్దేవా చేశారు. పొంగులేటి చెప్పే బాంబు లక్ష్మి బాంబా? సుతిలి బాంబా? తుస్సు బాంబా? అన్నీ తేలుతాయన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్లతోనే కొట్లాడామని.. ఈ చిట్టి నాయుడు తమకు పెద్ద లెక్క కాదు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. తనపై ఏమైనా కేసు పెట్టాలనుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
మొత్తంగా దీపావళి తర్వాత పొలిటికల్ డైనమెట్స్ పేలడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు జరిగితే.. రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్‌ఎస్ నేతలను భయపెట్టేందుకు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook