తెలంగాణలో ముందస్తుగా శాసనసభను రద్దు చేస్తూ టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ సంచలన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదమని గమనించిన తెలంగాణ సీఎం.. అందుకు సమయం ఇవ్వకూడదనే ముందస్తూ వ్యూహంతో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ వ్యహానికి ధీటుగా అదే స్థాయిలో దూకుడు పెంచాయి. ఎలాగైనా సరే ఈ సారి టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో బద్ధవిరోధి పార్టీలు టీడీపీ - కాంగ్రెస్ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు వ్యవహారం ఇప్పటికే కొలిక్కి వచ్చిందని పుకార్లు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీతో పొత్తు కోసం కమిటీ ఏర్పాటు
ఇదిలా ఉండగా ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీతో చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసినట్లు తెలిసింది. ఈ కమిటీలో ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోసు రాజు  ఉన్నట్లు  సమాచారం. టీడీపీతో చర్చల కోసం కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు తెలంగాణ టీడీపీ నేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా చర్చిస్తారని సమాచారం. అయితే టీడీపీ నేతలతో చర్చలు ఎప్పుడు ఎక్కడ జరపాలనే విషయంలో క్లారిటీ రాలేదు.. ప్రస్తుతం ఈ అంశంపై కమిటీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. 


కొలిక్కి వచ్చిన సీట్ల రద్దు బాటు ?


తెలంగాణ టీడీపీ నేతలతో పాటు చంద్రబాబుతో కమిటీ సభ్యుల భేటీ అనంతరం కాంగ్రెస్-టీడీపీల మధ్య సీట్ల పంపకంపై క్లారిటీ రానుంది. టీడీపీకి 10 అసెంబ్లీ ఒక ఎంపీ స్థానం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే టీడీపీ 15 అసెంబ్లీ ఒక ఎంపీ స్థానం కోరినట్లు తెలిసింది. కోదండరాంతో సహా మిగిలిన విపక్ష పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ టీడీపీలు సీట్ల విషయంలో సర్దుకుపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఏపీలో కూడా ఇదే తరహా పొత్తు


ఇదిలా ఉండగా కాంగ్రెస్ టీడీపీ పొత్తు తెలంగాణ వరకే పరిమితమా.. ఏపీలో కూడా ఉంటుందా అనే అంశం తేలాల్సి ఉంది. పరస్పర రాజకీయ అవసరాలను బట్టి చూస్తే ఏపీలో కూడా కాంగ్రెస్-టీడీపీలు కలిసి పోటీ చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ -టీడీపీ దోస్తీ తో  రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి.