Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..
Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..తిరిగి మళ్లీ కారులోనే షికారు చేయాలనే ఆలోచనలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారా....ఆ ఎమ్మెల్యేలను పాత గూటికి చేరకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు. కాంగ్రెస్ లో ఇది ఎలాంటి చర్చకు దారితీసింది..
Congress Vs BRS: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాదు వాళ్లు తిరిగి వాళ్లు తమ పార్టీలో చేరారని బీఆర్ఎస్ కూడా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఇది జరగడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కంటే రేవంత్ రెడ్డికి పెద్ద షాకింగ్ పరిణామానే చెప్పాలి.
బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాకిచ్చినంత పని చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తిరగడంపై రాజకీయాలను హాట్ హాట్ గా మార్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, భధ్రాచలం ఎమ్మెల్యే టి. వెంకట్ రావు ఇద్దరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా ..తిరిగి ఇద్దరు బీఆర్ఎస్ గూటికి చేరాలనుకుంటున్నారా అన్న చర్చ జోరుగా జరిగింది. అంతే కాదు దానిని బలపరిచేలా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆ ఇద్దరు తిరిగి పార్టీలో చేరారు అని ప్రచారం కూడా చేసింది. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండగానే జరగడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామం కాంగ్రెస్ ను ఒకింత షాక్ కు గురి చేశాయి. ఏంటీ నిన్న గాక మొన్న రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కు వెళ్లడం ఏంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెగ చర్చించుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు కూడా పలు అనుమానాలకు తావు తీసేలా ఉంది. కాంగ్రెస్ లో వారు అనుకున్న పనులు జరగపోవడంతో ఇలాంటి స్కెచ్ ఏమైనా వేశారా అన్న చర్చ కూడా జరుగుతుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ పై వారి స్పందన కూడా అలాగానే ఉంది. ఒకరేమో నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. మా మధ్య గత పరిచయంలో భాగంగానే వాళ్లను కలిసాను తప్పా దాని వెనుక ఎలాంటి రాజకీయం లేదని భధ్రాచలం ఎమ్మెల్యే తెర్లం వెంకట్ రావు చెప్పుకొచ్చారు. అంతే కాదు ఒక అడుగు ముందు కేసి అసలు బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ఎవరు సిద్దపడుతారు. ఆ పార్టీ పని అయిపోయింది. ఇలాంటి దిక్కుమాలిన ప్రచారం చేయడం తగదు అంటూ సీరియస్ అయ్యారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా పై కూడా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని . వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా గెలవనివ్వబోనని సవాల్ చేయడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది. అయితే దీని వెనుక ఆ ఎమ్మెల్యే పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం జరగుతుంది. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ లోని ప్రత్యర్థి వర్గంను కంట్రోల్ చేయడానికే ఇలా చేశారని ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తుంది. మరి ఏ ఆలోచన లేకుంటే వెంకట్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆయనను వైరి వర్గం ప్రశ్నిస్తోంది.
ఇక మరో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిది ఇంకో తీరు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈయన తీరుపై జిల్లా కాంగ్రెస్ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికార పార్టీలో చేరిన తరువాత కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో ఏ పని చేద్దామనుకున్నా జడ్పీ ఛైర్మన్ సరితా యాదవ్ అడ్డుపడుతుందనే భావనలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నారట. అసలే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్న అనుమానంతో కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఆయన ఆలోచన మారినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ లో ఉంటే తన హవా కొనసాగేదని ఇక్కడ ప్రతి విషయంలో జడ్పీ ఛైర్మన్ తో తీవ్ర పోటీ ఏర్పడుతుందని అనుకుంటున్నారట. అయితే దీనిని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తెచ్చినా కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వమని హితవు పలికారట. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో తన అసంతృప్తిని ఎలాగైనా వెళ్లగక్కాలని అనుకున్నారట. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలివిడిగా తిరగడం, తిరిగి బీఆర్ఎస్ లోకి పోతున్నట్లు ప్రచారం చేయించుకున్నారనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే బండ్ల పార్టీ మారుతున్న ప్రచారంతో తేరుకున్న కాంగ్రెస్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి జూపల్లి కృష్ణారావును రంగంలోకి దించింది.బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో డిన్నర్ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేతో మంత్రి జూపల్లి చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అంతే కాదు నీకు ఏదైనా సమస్య ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళుతానని త్వరలో రేవంత్ రెడ్డితో కూడా కలిపిస్తానని బండ్లకు జూపల్లి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. జూపల్లి చెప్పినట్లుగానే బండ్ల సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకున్నట్లు కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో రేవంత్ కూడా బండ్లకు భరోసా ఇచ్చినట్లు బండ్ల వర్గీయులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఆ ఇద్దరి ఎమ్మెల్యేల చర్యలతో వెంటనే అలెర్ట్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మీరు నన్ను నమ్మి పార్టీలోకి వచ్చారు. మీ బాధ్యత నాది. మీకు పార్టీలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఆ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. అంతే కాదు భవిష్యత్తులో పార్టీ పదవుల్లో మీకు ప్రాధాన్యత ఉంటుందనే అభయ హస్తంను ప్రకటించారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకరండన్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో వాటిని పరిష్కరిస్తానని కూడా రేవంత్ ఆ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం. మీరు ఎట్టి పరిస్థితుల్లో వేరే ఆలోచనలు చేయకండి అని వారిని రేవంత్ రెడ్డి కోరినట్లు ఆ ఎమ్మెల్యేల అనుచరవర్గం చెప్పుకుంటున్నారు. మరోవైపు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ అన్నప్పుడు సీఎం , మంత్రులు , ఇతర నేతలను కలవడం సర్వసాధారణం అని అందులో భాగంగానే ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిశారు. తప్పా అందులో మరో ప్రత్యేకత ఏమీ లేదని కొట్టిపారేశారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఒకింత అలజడి సృష్టించారు. అయితే నిజంగానే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వెళ్లాలనుకున్నారా లేక కాంగ్రెస్ లో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలా స్కెచ్ వేశారా అన్న చర్చ కూడా లేకపోలేదు. మొత్తానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సృష్టించిన పరిస్థితులు కాంగ్రెస్ లో టీ కప్పులో తుఫాను లాగా మారాయి. ప్రస్తుతానికి అంతా సద్దుమణిగినట్లు కనిపించినా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter