హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న 12 ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మునిసిపల్ అధికారులు.. ఆ ప్రాంతాలకు దారి తీసే రహదారులను పూర్తిగా మూసేశారు. ఆ 12 ప్రాంతాల నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండటం కోసం ఆయా ప్రాంతాల రహదారులను మూసేసి రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. రాంగోపాల్‌పేట్, షేక్‌పేట, రెడ్‌హిల్స్, మలక్‌పేట్-సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట, అల్వాల్, మూసాపేట్, కూకట్‌పల్లి, ఖుత్బుల్లాపూర్-గాజులరామారం, మయూరినగర్, యూసుఫ్ గూడ, చందానగర్ ప్రాంతాలను మునిసిపాలిటీ అధికారులు కంటెయిన్‌మెంట్ జోన్స్‌గా గుర్తించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Coronavirus updates from Telangana: తెలంగాణలో ఒకే రోజు 49 పాజిటివ్ కేసులు


ఇదే విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు పోలీసులు, రెవిన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారని అన్నారు. కరోనావైరస్ నివారణ కోసం సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంతాల్లో 89 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించిన తర్వాతే వాటిని 12 కంటెయిన్‌మెంట్ జోన్లుగా విభజించి కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ 12 హాట్‌స్పాట్స్ ప్రాంతాల్లో శానిటైజేషన్, డిస్‌ఇన్‌ఫెక్షన్ స్ప్రే చేయిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. 


Also read : EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి


ఓవైపు శానిటైజేషన్, డిసిన్ఫెక్షన్ స్ప్రేలు చేస్తూనే మరోవైపు మూసేసిన ఆ ప్రాంతాల్లోని ఇతర పాజిటివ్ కేసులను గుర్తించి వారిని ఐసోలేట్ చేసి కరోనా చికిత్స అందించడం ద్వారా కరోనావైరస్ ను ఆ ప్రాంతాల్లోంచి పూర్తిగా నిర్మూలించొచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వదంతులను నమ్మి ఎవ్వరూ ఆందోళనకు గురికావొద్దని మంత్రి ఈటల సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..