D Raja at BRS Meeting: బీజేపీపై పోరాటానికి ఖమ్మం సభ నాంది: రాజా
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
D Raja Speech at BRS Meeting in Khammam: ఖమ్మం వేదికగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథులలో ఒకరిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును, దేశాన్ని ప్రధాని మోదీ సర్కారు పరిపాలిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన ప్రసంగం ప్రారంభించడానికంటే ముందుగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పిస్తున్నా అని ప్రకటించిన రాజా.. తెలంగాణలో సుపరిపాలన అందుతోందని భావిస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్‌ను అభినందించారు. విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడిన రాజా.. దేశంలో నిరంతర కరెంటు సరఫరా, శుభ్రమైన తాగునీరు సరఫరా అందుతున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గొప్ప విషయం అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు, దళితబంధు పథకాలు దేశానికే ఆదర్శనీయం అంటూ తెలంగాణ సర్కారుపై డి రాజా ప్రశంసల జల్లు కురిపించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మంచి పథకాలు తీసుకురావాలి అని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని చెబుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఇది దేశానికే ప్రమాదం. దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడటం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ మొత్తం ఒక హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోంది అని డి రాజా ఆందోళన వ్యక్తంచేశారు.
దేశంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి అంశాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకే కొమ్ముకాస్తున్నారు. ప్రధాని మోదీ పేద ప్రజలు, రైతుల పక్షాన నిలవకుండా.. ప్రముఖ వ్యాపారవేత్తలైన గౌతం అదానీ, అంబానీ, టాటా, బిర్లాల జపం చేస్తూ కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను సైతం కేంద్రంల అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తోంది. కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దుమీరి ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు. బీజేపీని ఓడించడమే ప్రస్తుతం తమ అందరి ముందున్న కర్తవ్యం అని గుర్తుచేసిన రాజా.. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభనే నాంది కావాలి అని అభిప్రాయపడ్డారు.