తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నేత బయటకు వెళ్లిపోతున్నారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అనుచరులే చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న దామోదర రాజనర్సింహ.. తనను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారు. అదే సమయంలో తన సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే సంపత్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించడంపై కూడా దామోదర అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కుతారని దామోదర రాజనర్సింహ అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికలలో రాజనర్సింహ అంథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెరాస అభ్యర్థి, సినీ నటుడు బాబూమోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే, బాబూ మోహన్‌పై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు.. ఈ స్థితిలో దామోదర రాజనర్సింహ టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.


ఇప్పటికే మాజీ మంత్రి దానం నాగేందర్ తెరాసలో చేరారు. మరో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.