Delhi Liquor Scam Case latest news updates: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై సమగ్ర దర్యాప్తు వివరాలను కోర్టుకు సమర్పించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్... నాలుగవ సప్లమెంటరీ చార్జి షీట్‌లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావించింది. 278 పేజీల భారీ చార్జిషీట్ లో అరుణ్ పిళ్లై, బుచ్చి బాబు సమీర్ మహేంద్రలు ఈడికి ఇచ్చిన తమ తమ వాంగ్మూలాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చార్జిషీట్లో సంచలన విషయాలు
లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే కవిత, ఆప్ విజయ్ నాయర్ మధ్య  చర్చలు జరిగాయని.. ఆ తర్వాతే మద్యం పాలసీ ఖరారుచేశారని ఆరోపించిన ఈడి.. అందుకు సాక్ష్యంగా కవిత కాల్ డేటా రికార్డును కోర్టుకు సమర్పించింది.


ఏప్రిల్ 8, 2022న కవిత అరుణ్ పిళ్లైలు వంద కోట్ల ముడుపుల సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై విజయ్ నాయర్, దినేష్ అరోరాతో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో చర్చించారు. సౌత్ గ్రూపునకు అనుకూలమైన విధానం రూపకల్పన చేసి ముడుపులు అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయ నాయర్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కవిత, సమీర్ మహేంద్ర ఫేస్ టైంలో మాట్లాడుకుని బిజినెస్ బాగుందని అభినందనలు తెలుపుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్ వన్ దరఖాస్తు ఆలస్యం కావడంపై సమీర్ మహేంద్రతో కవిత చర్చలు జరిపినట్టు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి. బ్రిండ్ కో యజమాని అమన్ దల్ తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమీర్ చెప్పుకురాగా.. అలాంటి సమస్యలుంటే తాను డీల్ చేస్తానన్న కవిత బదులిచ్చినట్టుగా ఈడీ స్పష్టంచేసింది.


ఈ అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారు. తన తరఫున అరుణ్ వ్యాపారంలో ఉంటారని.. ఇంకా అవసరమైతే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని కవిత సూచించినట్టు ఈడీ తమ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. తాను కవితను రెండుసార్లు కలిశానని, ముడుపులు తిరిగి రాబట్టుకునే అంశంపై చర్చించానని విజయ్ నాయర్ తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. 


2022 నవంబర్ 11 రోజున ఈడి ముందు కీలక సాక్ష్యం ఇచ్చిన అరుణ్ పిళ్ళై.. కవితకు ఆప్ పార్టీకి మధ్య 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది అని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అలాగే ఇండో స్పిరిట్ సంస్థలోనూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వాటాలు ఉన్నాయని.. కవిత తరపున తానే భాగస్వామిగా పనిచేశాను అని అరుణ్ పిళ్ళై వెల్లడించడం కవితకు ఇబ్బందికరమైన పరిణామంగా మారింది.పెర్నార్డ్ రికార్డు బిజినెస్‌ను ఇండోస్పిరిట్‌కు ఇప్పించి, అందులో 65% వాటాలు పొందారు. ఈ వ్యాపారంలో కవితే అసలైన ఇన్వెస్టర్. ఈ విషయంలో కవితకు, ఆప్ పార్టీకి మధ్య సంపూర్ణమైన అవగాహన కుదిరింది అని ఈడీ ఆరోపిస్తోంది.