Whatsapp number for Dharani portal complaints: హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌‌‌‌లో లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. అందులో భాగంగానే ధరణి పోర్టల్‌‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధరణి పోర్టల్‌పై రైతులు, ప్రజలు తగిన వివరాలతో తమ ఫిర్యాదులను 9133089444 నంబర్‌కు వాట్సాప్ లేదా ascmro@telangana.gov.inకు మెయిల్ చేయాలని సూచించారు. రెవిన్యూ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో పేర్లు కనిపించడం లేదని, మ్యుటేషన్ పనులు పెండింగులో ఉంటున్నాయని ఇటీవల కాలంలో ఫిర్యాదులు (Complaints about Dharani portal) వస్తున్న క్రమంలోనే రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ వాట్సాప్ నంబర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 


ధరణి పోర్టల్‌లో (Dharani portal) తమ భూమి తమ పేరిట చూపించకపోవడంతో రిజిస్ట్రేషన్ పనులు నిలిచిపోయాయంటూ పలువురు రైతులు సోషల్ మీడియా ద్వారా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఫిర్యాదు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.