తెలంగాణలో 70 లక్షల ఓట్లపై గందరగోళం: కాంగ్రెస్
`తెలంగాణలో 70 లక్షల ఓట్లపై గందరగోళం`
ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో మోసాలు చోటుచేసుకున్నాయని.. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
సింఘ్వి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల ఓట్లపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో 30 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తొలగించారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశాం. కానీ అక్కడి నుంచి సంతృప్తికరమైన జవాబు రాలేదు.' అని సింఘ్వి అన్నారు.
సింఘ్వి మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జాబితాలో సుమారు 18లక్షల మంది ఓటర్ల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ఓట్ల జాబితాపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికలు ఎక్కడా జరిగినా ముందుగా ఓటరు జాబితాను సరిచేస్తారని.. కానీ తప్పులుతడకగా ఉన్న తెలంగాణ ఓటర్ల జాబితాను సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అభిషేక్ మను సింఘ్వి ప్రశ్నించారు.