TRS MLAs Poaching Case: నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో విచారణ జరగకుండా అడ్డుకునేలా తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటీషన్ దాఖలు చేసిందని టీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలను బీజేపి ఖండించింది. టీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న దుష్ప్రచారం అని బీజేపి జాతీయ అధ్యక్షురాలు డి.కే. అరుణ అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో జరిగిన ఫామ్ హౌజ్ ఫైల్స్ వ్యవహారంలో వాస్తవాలను తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారులు ఎవరో బయటపడాలంటే.. హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం కానీ విచారణను అడ్డుకోవాలని చూడటం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ విచారణను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది కనుకే తామలా డిమాండ్ చేస్తున్నామని.. అందులో తప్పేముంది అని డి.కె. అరుణ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు కేసీఆరే..
తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే గత సాంప్రదాయాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ఏవేవో వీడియోలను చూపిస్తూ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసిఆరే స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు.. సీఎం అభిప్రాయానికి భిన్నంగా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం మరో కోణంలో ఎలా విచారణ జరపగలదు ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఉద్దేశాలు సిట్ బృందం చేపట్టే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డి.కే. అరుణ అభిప్రాయపడ్డారు. 


ముఖ్యమంత్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా వెళ్తారని లాజిక్ ఎత్తిన డికె అరుణ
సీఎం కేసీఆర్ స్వయంగా బీజేపిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణ జరిపే అవకాశం ఏ మాత్రం లేనందునే సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నాం అని డికే అరుణ మీడియాకు తెలిపారు. మాకు ముఖ్యమంత్రిపై నమ్మకం లేదు కానీ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని.. అందుకే న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరుతున్నామని అన్నారు. 


కేసీఆర్ న్యాయమూర్తులకు లేఖలు రాస్తానన్నది ఉత్తుత్తిదేనా.. మరో లాజిక్..
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేసేందుకు యత్నించిందని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు సహా దేశంలోని అన్ని హై కోర్టుల న్యాయమూర్తులకు తాను అన్ని ఆధారాలతో యుక్తంగా లేఖలు రాశానని చెప్పిన కేసీఆర్‌కి.. తాము న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని కోరితే వచ్చిన తప్పేంటని డికే అరుణ విస్మయం వ్యక్తంచేశారు. ఒకవేళ నిజంగానే న్యాయ వ్యవస్థపై గౌరవం ఉండి కేసీఆర్ ఆ లేఖలు రాసిన మాట నిజమే అయితే.. హై కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే విచారణ జరిపించాలన్న తమ డిమాండ్‌ని కూడా గౌరవించాలని సీఎం కేసీఆర్‌కు డి.కె. అరుణ సవాల్ విసిరారు.