Kothagudem BRS MLA Ticket: కొత్తగూడెంలో సీన్ క్రియేట్ చేయొద్దని మంత్రి హరీశ్ రావు క్లాస్ ? స్పందించిన డా. గడల
Dr Gadala Srinivas Rao News: పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Dr Gadala Srinivas Rao News: పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో అనేక సందర్భాల్లో డాక్టర్ గడల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలోని పెద్దలను కొనియాడుతూ పలు వ్యాఖ్యలు చేయడమే ఈ ప్రచారానికి ఓ కారణం కాగా.. డాక్టర్ గడల శ్రీనివాస్ రావు తన స్వస్థలమైన కొత్తగూడెంలో జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుండటం ఇందుకు మరో కారణమైంది. అంతేకాదు.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతూ డా శ్రీనివాస రావు తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతుండటం వంటి పరిణామాలు మీడియా కంటపడకపోలేదు.
గతేడాది ఓ ఈవెంట్‌లో కేసీఆర్ కలిసిన డా గడల శ్రీనివాస్ రావు.. అక్కడ రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ప్రజా ధనంతో జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇలా ముఖ్యమంత్రికి ఒంగి ఒంగి కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అని అప్పట్లోనే నెటిజెన్స్ ఫైర్ అయ్యారు.
డాక్టర్ గడల శ్రీనివాస్ రావు గత కొంతకాలంగా కొత్తగూడెంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని.. తన రాజకీయ రంగ ప్రవేశానికి అవసరమైన ఓట్లు దండుకునేందుకు ఇప్పటి నుండే స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. అంతేకాదు... విపక్షాల నేతలు సైతం వివిధ సందర్భాల్లో డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వైఖరిని విమర్శిస్తూ.. ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్ లా కాకుండా బీఆర్ఎస్ సర్వెంట్‌లా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆ వ్యాఖ్యలు చేయకపోతే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరితే అయిపోతుందిగా అంటూ సెటైర్లు సైతం వేస్తూ వస్తున్నారు.
ఇదిలావుంటే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. కొత్తగూడెం నియోదకవర్గం నుండి యధావిధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వనమా వెంకటేశ్వర్ రావుకే సీటును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో మరోసారి డాక్టర్ గడల శ్రీనివాస్ రావు పేరు వార్తల్లోకొచ్చింది. కొత్తగూడెం సీటు ఆశించిన గడల శ్రీనివాస్ రావు అక్కడ తన అనుచరుల చేత సీన్ క్రియేట్ చేయించే అవకాశం ఉందని.. అందుకే అక్కడ ఈ పొలిటికల్ కామెంట్లు చేయొద్దని శ్రీనివాస్ రావుకు మంత్రి హరీశ్ రావు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది.
స్పందించిన డా గడల శ్రీనివాస్ రావు
దీంతో మంత్రి హరీశ్ రావు తనకు క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా గడల శ్రీనివాస్ రావు స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో నిజం లేదన్న శ్రీనివాస్ రావు.. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నానన్న శ్రీనివాస్ రావు... అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అని చెప్పిన శ్రీనివాస్ రావు... తనపై గిట్టని వారే తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అని అన్నారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తాం. సీఎం కేసీఆర్ అందించిన సేవా స్పూర్తితో ముందుకెళ్తాం అని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Chandrababu Meeting with Telangana TDP: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ
చివరకు జరిగేది ఏంటి ?
ఏదేమైనా కొత్తగూడెంలో ముందు నుంచి పార్టీనే పట్టుకుని ఉన్న జలగం వెంకట్ రావు, కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొత్తగూడెం నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని ఇటీవల హై కోర్టు తీర్పునివ్వగా ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. కాగా సుప్రీం కోర్టు హై కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా వనమా వెంకటేశ్వర రావుకి సూచించిన సంగతి తెలిసిందే. జలగం వెంకట్ రావు vs వనమా వేంకటేశ్వర రావు మధ్య న్యాయ పోరాటం ఇలా ఉండగానే తాజాగా అధిష్టానం మాత్రం కాంగ్రెస్ నుండి వచ్చిన వనమా వేంకటేశ్వర రావుకే ప్రాధాన్యం ఇస్తూ ఆయన పేరునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చేర్చింది. ఇక ఇప్పుడు జలగం వెంకట్ రావు ఏం చేయనున్నారు, ఇక్కడి నుండే గంపెడాశలు పెట్టుకున్న డా గడల శ్రీనివాస్ రావు ఏం చేయనున్నారు అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లోగా బీఆర్ఎస్ పార్టీ అధినేత బీఫారం ఇచ్చేలోగా ఏమైనా జరగొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏం జరగనుందో వేచిచూడాల్సిందే మరి. ఒకవేళ నిజంగానే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా గడల శ్రనివాస్ రావు రాజకీయాలపై ఆశపెట్టుకున్న కారణంగానే కేసీఆర్ ని ప్రసన్నం చేసుకోవాలని భావించినట్టయితే.. ఆయన మరో ఐదేళ్లు వేచిచూస్తారా ? లేక లోలోపల ఆయనకు పార్టీ నుండి ఏమైనా వేరే హామీ ఉందా అనేది తేలాల్సి ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీశ్ రావు క్లాస్ తీసుకున్నట్టుగా వచ్చిన ప్రచారంపై స్పందించినట్టుగానే.. ఇది కూడా డా గడల శ్రీనివాస రావు తన నోట తనే చెబితే అయిపోతుందిగా అని అనేవాళ్లు కూడా లేకపోలేదు.
ఇది కూడా చదవండి : Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి