ప్రతి పాఠ్యపుస్తకానికి సీరియల్ నెంబర్
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాదు: ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాలకు వరుస నెంబర్లు కేటాయించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో జిల్లాలకు అవసరమైన పాఠ్యపుస్తకాలను తెప్పించినప్పటికీ సరిపోకపోవడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పాఠ్యపుస్తకాలకు సీరియల్ నెంబర్ కేటాయించనుంది.
ఒక్కో సబ్జెక్టు వారీగా ఎన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి? ఏ వరుస సంఖ్య నుంచి ఏ వరుస సంఖ్య వరకు పుస్తకాలను సంబంధిత పాఠశాలలకు పంపించారో విద్యాశాఖ వద్ద సమాచారం ఉంటుంది. పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు వరుస క్రమంలో పంపిణీ చేస్తారు. ఒక్క పుస్తకం తప్పిపోయినా సంబంధిత పాఠశాలలో ఓ విద్యార్థికి ఆ పుస్తకం అందదు. దీనికి సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యాశాఖ పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేయాలి. అలా కాకుండా ఒక్క పుస్తకం కూడా ప్రవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్ళినా ఇట్టే తెలిసిపోతుందని.. తద్వారా సంబంధితులపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా సబ్జెక్టుల వారీగా అన్ని పుస్తకాల రెండోపేజీలో ఈ వరుస సంఖ్యను ముద్రిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.