టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు
టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నోటీసులు పంపించారు.
టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నోటీసులు పంపించారు. తెలంగాణ మంత్రులు ప్రభుత్వ అధికారిక భవానాల్లో ఎన్నికల భేటీలు నిర్వహిస్తున్నారని కొందరు మహాకూటమి నేతలు ఇటీవలే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఈసీ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశవరావుకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఇటీవలే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ మొదలైన వారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇదే క్రమంలో ప్రగతి భవన్‌లో ఎన్నికల సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని.. ఈ వైఖరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కొందరు మహాకూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని తెలంగాణ మంత్రులపై కూడా మహాకూటమి సభ్యులు ఆరోపణలు చేశారు.
ఇటీవలే ఇదే అంశంపై మాట్లాడుతూ.. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘం కేసీఆర్ జేబుసంస్థగా పనిచేస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 12న ఈసీ విడుదల చేసిన ఓటరు జాబితాలోని పొరపాట్లపై హైకోర్టులో అఫిడవిట్‌తోపాటు 866 పేజీల మెటీరియల్ అందించామని ఆయన తెలిపారు. తమకు అవసరమైన సమాచారం అందకూడదనే ఉద్దేశంతో వెబ్‌సైట్ ఫార్మాట్‌ను కూడా ఈసీ మార్చేసిందని ఆయన ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలు చేసిన మూడు రోజుల్లోనే ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీకి నోటీసులు పంపించడం గమనార్హం.