Etela Rajender: ఈటల రాజేందర్ టార్గెట్ అదేనా.. అందుకే యాక్టివ్ గా తిరుగుతున్నారా..!
Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నిత్య ప్రజాక్షేత్రంలో ఉంటే కీలక పదవి దక్కొచ్చని ఆశపడుతున్నారు . హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా నిరసిస్తున్న ఆ నేత.. ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చారు. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తే తనకు దక్కాల్సిన పదవి దక్కుతుందని ఆశపడుతున్నారా అంటే ఔననే అంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
Etela Rajender: తెలంగాణ హైడ్రా కూల్చివేతలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. పెద్దలకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసినా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. పైగా రేవంత్ రెడ్డి గట్స్ ను మెచ్చుకన్నారు. కానీ పేదల ఇళ్ల కూల్చివేతల్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై కాషాయ పార్టీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో పేదల ఇళ్లను కూల్చొద్దని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మూడు రోజులుగా హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్ని పరిశీలించారు. రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలపై మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేతల్ని ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈటెల రాజేందర్ నేరుగా ప్రజా క్షేత్రంలోకి దిగడంతో పార్టీ శ్రేణులు సైతం ఖుషీ అవుతున్నట్టు తెలిసింది.
కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుత ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజీబిజీ అయిపోయారు. కేంద్రమంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేంత సమయం ఆయనకు లేకుండా పోయింది. పైగా బీజేపీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి అనేది ఉంది. దాంతో కొత్త చీఫ్‌ను నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లోపు పార్టీకి కొత్త నాయకత్వం వస్తే పార్టీ గ్రామ గ్రామాన విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లే కాకుండా ఒకరిద్దరూ డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. అయితే పార్టీ చీఫ్ పదవిపై కన్నేసిన ఎంపీ ఈటెల రాజేందర్ ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉంటేనే తనకు కలిసివస్తుందని భావిస్తున్నారట. అందుకే ఎక్కువగా మీటింగ్‌లకు హాజరవుతూ.. హైడ్రా కూల్చివేతలపైన కూడా స్పీడ్ పెంచినట్టు టాక్ వినిపిస్తోంది..
ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్.. పార్టీలో చేరగానే ఆయనకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరిగింది. అంతలోపు ఎన్నికలు రావడంతో కమలం పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో బరిలో దిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో రాష్ట్ర చీఫ్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. దాంతో అధ్యక్ష పదవి ఈటెలకే అన్నట్టు ప్రచారం సాగింది. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు జరగడంతో ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేశారు. మల్కాజ్‌గిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాంతో ఈటెలకు మంత్రి పదవి రాబోతుందని చెప్పారు. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కడంతో.. ఈటెలకు రాష్ట్ర చీఫ్ పదవిపై ఆశలు మరింత రెట్టింపు అయ్యాయి.. కానీ ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడి నియామకమే జరగలేదు. ఈ సీన్లన్నీ గమనించిన ఈటెల రాజేందర్ చివరకు ప్రజా క్షేత్రంలోనే ఉంటూ పోరాడటమే శరణ్యమని నమ్మారు. ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటే.. మరింత గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారట.. అందుకే ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు హైడ్రా కూల్చివేతల్ని ఈటెల రాజేందర్ విమర్శిస్తున్నారు.
ఇందులో భాగంగానే హైడ్రా బాధితులకు మద్దతుగా కొత్తపేటలోని గణేష్ నగర్‌లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. అక్కడ బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్న ఈటల హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానంటూ స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నేతకే టీసీసీ ఛీప్ పదవి ఇచ్చింది. అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము మరో సామాజికవర్గానికి రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తే తేడా వస్తుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది. అందుకే బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఈటెల రాజేందర్ ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.