ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ అంశం చర్చనియాంశమైన నేపథ్యంలోనే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇవాళ హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుని కలిశారు. కేంద్రంలో ఇంతకు ముందు అధికారంలో వున్న కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న పలువురు నేతల దృష్టిని ఆకర్షిస్తూ బలంగా థర్డ్ ఫ్రంట్ వాణిని వినిపిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వచ్చి కలవడం ఒకింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఆయనకు తన మద్దతు ప్రకటించిన హేమంత్ సోరెన్.. అందులో భాగంగానే బుధవారం  హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు సోరెన్‌కు కేసీఆర్ సైతం సాదర స్వాగతం పలికి... తనకు మద్దతు ప్రకటించినందుకు ప్రతిగా కృతజ్ఞతలు తెలిపారు. 


తన నివాసంలోనే హేమంత్ సోరెన్‌కి లంచ్ విందు ఏర్పాటు చేసిన కేసీఆర్.. లంచ్ అనంతరం జాతీయ రాజకీయాలపై, ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, ఆదరణ, ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి చెందిన హేమంత్ సోరెన్ గతంలో జార్ఖండ్ రాష్ట్రానికి 5వ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.