పెళ్లి రిసెప్షన్ వేడుకలో వివాదం.. వధూవరులు, పెళ్లి వారింటిపై డీజే గ్యాంగ్ దాడి!
ఈ ఘర్షణలో వదూవరులు, వారి కుటుంబసభ్యులు, బంధువులకు గాయాలయ్యాయి. డీజే నిర్వాహకులైన మణ్యం రాజు వర్గీయులే హాకీ స్టిక్స్ తీసుకొని వచ్చి తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: వివాహం రిసెప్షన్ వేడుకలో ఏర్పాటు చేసిన డీజే శబ్ధం పెంపుదల విషయంలో చెలరేగిన వివాదం కాస్తా రిసెప్షన్ నిర్వహించిన కుటుంబానికి, డీజే నిర్వాహకులకు మధ్య భారీ ఘర్షణకు దారితీసిన ఘటన హైదరాబాద్‌లోని సూరారంలో చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వదూవరులు, వారి కుటుంబసభ్యులు, బంధువులకు గాయాలయ్యాయి. డీజే నిర్వాహకులైన మణ్యం రాజు వర్గీయులే హాకీ స్టిక్స్ తీసుకొని వచ్చి తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధూ, వరులపై అడ్డొచ్చిన బంధువులపై దాడికి పాల్పడిన దుండగులు పలువురి మెడలోని బంగారం సైతం చోరీ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వివాదంపై స్పందించిన సూరారం పోలీసులు.. డీజే విషయంలో చెలరేగిన వివాదమే రిసెప్షన్ ఏర్పాటు చేసిన కుటుంబానికి, డీజే నిర్వాహకులకు మధ్య ఘర్షణకు కారణమైందని తెలిపారు. అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసిన కారణంగా వరుడు సాయికుమార్ కుటుంబంపై, అనుమతి లేకుండానే డీజే నిర్వహించినందుకు డీజే యజమానిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మొత్తం మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దాడికి బాధ్యులైన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లి కళ ఉట్టిపడాల్సిన ఇంట్లో గాయాలతో తలలు పట్టుకుని పోలీసు స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది.