హైదరాబాద్: స్థిరాస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఎదురయ్యే ఆటకాలను, దళారులు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి వచ్చే ఇబ్బందులకు పరిష్కారం చూపేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ వాట్సాప్  నెంబర్ (7093920206)ను అందుబాటులోకి  తీసుకొచ్చింది.  ఈ నంబర్‌కు సమాచారమిస్తే అధికారులు తక్షణం స్పందిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. దళారులు/ డాక్యుమెంట్ రైటర్ల దందాపైనా ఫిర్యాదు చేయాలన్న అధికారులు సర్వర్ డౌన్ సమస్యల వల్ల కూడా రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయని.. డాక్యుమెంట్ల జారీలో కొన్ని చోట్ల అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు.


ఫలానా సర్వేనంబర్ భూమిలో రిజిస్ట్రేషన్‌లు కావడం లేదని, కొంత డబ్బు ఇస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తామని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొందరు దళారులు/డాక్యుమెంట్ రైటర్లు దందా చేస్తున్నట్టు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఈ వాట్సప్ నంబర్‌ తీసుకొచ్చామని.. ఈ నెంబర్‌కు మీ ఫిర్యాదులు పంపితే, సంబంధిత జిల్లాల డీఐజీలు, రిజిస్ట్రార్లకు చేరవేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ చెప్పింది. సంబంధిత అధికారులు వెంటనే సమాధానమిచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఆ శాఖ తెలిపింది.