తెలంగాణపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు గుప్పించారా ?
దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కితాబు ఇచ్చారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అని మన్మోహన్ సింగ్ కీర్తించారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇకపై కూడా అభివృద్ధి ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పిన మన్మోహన్ సింగ్.. ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోంది కనుకే తాను తెలంగాణను ప్రశంసిస్తున్నాను అని అభిప్రాయపడినట్టు సమాచారం.
ఇటీవల కొత్తగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ వద్దకు తీసుకెళ్లిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు వారిని ఆయనకు పరిచయం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి టీఆర్ఎస్ నేతలు మన్మోహన్ సింగ్ కి వివరించే సందర్భంలోనే ఆయన వారితో మాట్లాడుతూ తెలంగాణను ప్రశంసించినట్టు సమాచారం.