హైదరాబాద్: తెలంగాణలోకరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినపట్టికీ, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని, దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. హైదరాబాద్ లో దోమలగూడలో నివాసం ఉంటున్న దంపతులైనా డాక్టర్లకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది.


మరోవైపు కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ తేలిందని, ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తితో కలిసి ఉండడంతో కుత్బుల్లాపూర్ వ్యక్తికి కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. ఇదిలావుండగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జడ్చర్ల లో కావేరమ్మ పేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని, కాగా ఈ వ్యక్తి శంషాబాద్ లోని విమానాశ్రయం వద్ద విధులు నిర్వర్తించేవారని ప్రకటించారు. భారత్ లో ఇప్పటి వరకు 706 మందికి కరోనా పాజిటివ్ రాగా 14 మంది మృతి చెందారు. ఈ ఒక్కరోజే 24 మందికి కరోనా సోకినట్టు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..