Petrol, diesel prices today Hyderabad: హైదరాబాద్‌: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 మార్క్ దాటగా.. ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  తాజాగా ఇవాళ లీటర్ పెట్రోలుపై 36 పైసలు పెరగగా, లీటర్ డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 109 లకు చేరుకోగా డీజిల్‌ ధర రూ.102.04 మార్క్ తాకింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలను పెంచకుండా ఉపశమనం ఇచ్చిన ఆయిల్ కంపెనీలు గత పది రోజులుగా మాత్రం వరుసగా పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తొస్తే చాలు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు సామాన్యుడిపై సైతం పరోక్షంగా ధరల భారాన్ని (Price hike) పెంచుతున్నాయి. 


డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు సైతం అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో పెరుగుతున్న ఇంధనం ధరలు (Petrol, diesel prices) వాహనదారులపైనే కాకుండా సామాన్యులపైనా ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి.


పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆందోళన చేపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ధరలు మాత్రం దిగిరావడం లేదు సరికదా ఇంకా పైపైకే ఎగబాకుతున్నాయని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు ఎల్పీజీ గ్యాస్ ధరలు (LPG price today) సైతం వెయ్యి రూపాయలకు చేరువయ్యాయి.