పంచాయితీరాజ్ మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సర్పంచులకు అధికారాలు కల్పించేలా పంచాయితీరాజ్ బిల్లును రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో గ్రామ సర్పంచుల నిధులు, బాధ్యతలపై చర్చించింది. ఈ సమావేశం సుమారు ఏడుగంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, పోచారం, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సర్పంచులకు విస్తృత అధికారాలతో పాటు బాధ్యతలతో కూడిన పూర్తి కార్యనిర్వాహక అధికారాలు అప్పగిస్తూ.. చట్టంలో ఏఏ విధులను పేర్కొనాలో చర్చించారు. పంచాయితీలకూ కో- ఆప్షన్ సభ్యుడిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామసభ కాలవ్యవధిని ఆరు నెలల నుండి ఒకటి లేదా రెండు నెలలకి కుదించాలని, వరుసగా రెండు ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ అమలు చేసే అంశాలపైనా చర్చించారు. బిల్లు రూపకల్పనలో తీసుకోవలసిన న్యాయపరమైన అంశాలకు సంబంధించి అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డితో చర్చించారు.