Gaddar No More: తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచిన గొంతు మూగవోయింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ హఠాన్మరణంతో యావత్ తెలంగాణ లోకాన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం బైపాస్ సర్జరీ విజయవంతం అవ్వగా.. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గద్దర్ మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతుండగా.. అభిమానులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో గుండె చికిత్సలపై గద్దర్ రాసిన లేఖ వైరల్ అవుతుండగా.. ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు.  ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.  


నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/బేగంపేటలోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్‌లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుంచి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. 


గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి.శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్.నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి.సూర్య ప్రకాశ్ గారు, బి.సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను. నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్‌కు చెందిన కింది నెంబర్ : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్)కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి.
ఇట్లు
ప్రజా గాయకుడు 
మీ గద్దర్.." అంటూ గద్దర్ విడుదల చేసిన ప్రకటన కంటతడి పెట్టిస్తోంది. పూర్తి ఆరోగ్యంతో కోలుకుని.. తన గాత్రంతో సాంస్కృతిక ఉద్యమం మళ్లీ ప్రారంభిస్తారని అనుకుంటున్న తరుణంలో యావత్ తెలంగాణను విషాదంలోకి నెడుతూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.


Also Read: EPFO Interest Update: ఈపీఎఫ్‌ వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారా..? క్లారిటీ ఇదిగో..! బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి  


Also Read: East Godavari Road Accident: ఫ్రెండ్‌షిప్ రోజు ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి