ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీలో దింపుతామని తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీ-మాస్)రాష్ట్ర ఛైర్మన్ కంచ ఐలయ్య ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పోటీచేసే స్థానం-గజ్వేల్ నుంచి గద్దర్ పోటీ చేస్తారని అన్నారు. ఆపద్ధర్మ మంత్రి కే.తారక రామారావు పోటీ చేసే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రజా గాయని విమలక్క బరిలోకి దిగుతున్నట్లు కంచ ఐలయ్య తెలిపారు. దీనికి వారిద్దరూ అంగీకారం తెలిపారన్న ఆయన.. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగుతారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ పోటీకి సీపీఐ(ఎం), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు తెలిపాయని చెప్తూ.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ సహా ఏ రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థుల్ని ఈ ఎన్నికల్లో నిలబెట్టకుండా వారికి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.  


గద్దర్‌ పాటలతోనే కేసీఆర్‌ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి గెలుపొందారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకే రాబోయే ఎన్నికల్లో గద్దర్‌ను పోటీకి దింపుతున్నట్లు చెప్పారు. అయితే పోటీపై తాను ఇప్పుడేమి మాట్లాడదలచుకోలేదని.. నిర్ణయం త్వరలో చెబుతానని విమలక్క అన్నారు. విమలక్క ఒకవేళ పోటీ చేస్తే స్థానికేతర అంశం ప్రధాన అవరోధం అవుతుందని విశ్లేషకుల భావన.