భారతదేశంలో యువరక్తం ఉంది. కొత్త ఆలోచనలతో ఆవిష్కరణ చేస్తే.. భారత్ ను ఆపే శక్తి ఎవరికీ ఉండదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం హెచ్ఐసీసీలో  టి-హబ్, నీతిఆయోగ్, ఇంక్ సంయుక్తంగా నిర్వహించిన జిఈఎస్ 2017 సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో 50%పైగా 27ఏళ్లలోపు వారున్నారని.. వీరు ఆలోచిస్తే కొత్త ఆవిష్కరణలు ఎన్నో తయారవుతాయని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచాన్ని మార్చే శక్తి స్మార్ట్ ఫోన్ కు ఉందని ఉదహరించారు. సామాన్యులకు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వం డిజిటల్ సేవల ద్వారా త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఇందుకు ఉదాహరణ తాము ప్రవేశపెట్టిన ఎంవాలెట్ యాప్ అని గుర్తుచేశారు. మెట్రో నగరాల్లో వాహన చోదకులు వాహన పత్రాలు వెంటబెట్టుకొని పోవలసి వస్తుంది. మా ఈ యాప్ తో వాహనదారులకు ఆ బాధ తప్పింది. ఇప్పటికే యాప్ ను 1.5 మిలియన్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పారు.


ప్రపంచ పారిశ్రామికవేత్తలకు భారత్ పెట్టుబడులకు స్వర్గధామం. హైదరాబాద్ పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనువైనది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షులు బీవీ మోహన్ రెడ్డి, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి తదితరులు పాల్గొన్నారు.