హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన అనుచరులతో, ప్రజలతో ఎలా మమేకమవుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాయిన్ బాక్స్ ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేసి సమస్యలు చెప్పుకుంటే చాలు వాటిని పరిష్కరించే మనసున్న ప్రజాప్రతినిధిగా, సన్నిహితమిత్రులకు హరీషన్నగా ఆయన సుపరిచితం. అందుకే రేపు సోమవారం జూన్ 3న ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని హరీష్ రావు అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావించారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా తమ ప్రియతమ నేతను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలపాలని అనుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇదే విషయమై తనకు ఫోన్ చేసిన అభిమానులు, అనుచరులను ఉద్దేశిస్తూ తాజాగా హరీష్ రావు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన పుట్టిన రోజునాడు తనను కలిసి శుభాకాంక్షలు చెప్పాలని, తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన హరీష్ రావు.. తాను ఆరోజు అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నందుకు తనను మన్నించాల్సిందిగా ఆ ట్వీట్‌లో కోరారు. ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం తాను మరొకపనిపై వెళ్లాల్సి వచ్చినందున మీ అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నానని హరీష్ రావు ఆ ట్వీట్‌లో వెల్లడించారు. అంతేకాకుండా తనపై వున్న ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటుకోవాలని విజ్ఞప్తిచేశారు.



తాను అందుబాటులో ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్న విషయాన్ని తనవారికి తెలియజేయాలనే ఉద్దేశంతో పాటు నలుగురికి మేలు చేసే పనిచేయాలనే మనస్తత్వంతో హరీష్ రావు చేసిన ఈ ట్వీట్ ఆయన అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ కిందే ఆయనకు కామెంట్స్, రిట్వీట్స్ రూపంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు సైతం వెల్లువెత్తుతున్నాయి.