కనివిని ఎరుగని స్థాయి మెజార్టీతో హరీశ్ రావు విజయం
సిద్ధిపేట అభ్యర్ధిగా బరిలోకి దిగిన హరీశ్ రావు భారీ మెజార్టీతో విజయ బావుటా ఎగురవేశారు . టీజేఎస్ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై ఏకంగా లక్షా 20 వేల 650 ఓట్ల తేడాతో భారీ గెలుపును సొంతం చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ రానంత మెజార్టీ హరీశ్ తెచ్చుకున్నారు. కాగా గత 2014 సాధారణ ఎన్నికల్లో 95,328 ఓట్ల మెజార్టీతో హరీశ్ రావు గెలుపు సాధించారు. ఈ సారి ఎలాగైన లక్షకుపైగా మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. సిద్ధిపేట ప్రజలు కూడా హరీశ్ రావు ను అదే స్థాయిలో ఆదరించి లక్ష పైచిలుకు మెజార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ తనకు స్థాయిలో గెలుపునందించిన సిద్ధిపేట ప్రజలను రుణమపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అంత మంచి పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు అనవసరంగా బురదచల్లాయని...అందుకే ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని హరీశ్ రావు వివరించారు.