హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేశారు. పలుచోట్ల అపార్ట్‌మెంట్ సెల్లార్లలో, ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రెండు రోజులుగా సాయంత్రం వేళ కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో చినుకు పడిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం సాయంత్రం క్యూములోనింబస్‌ మేఘాల ప్రభావంతో నగరం నలుమూలలా భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 


సికింద్రాబాద్‌, బొల్లారం, తిరుమలగిరి, ఖైరతాబాద్‌, రాజేంద్రనగర్‌, ముషీరాబాద్‌, బాలానగర్‌, మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, బోడుప్పల్, ఘట్‌కేసర్, ఎల్‌బి నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బొల్లారంలో అత్యధికంగా 5.4 సెం.మీ, తిరుమలగిరిలో 5.2 సెం.మీ వర్షం కురిసింది.