హైదరాబాద్‌లో కుండపోత వర్షం
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా వర్షం ముంచెత్తింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి పడిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సుమారు గంటలకు పైగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లిహిల్స్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ తదిత ప్రాంతాల్లో ఈ ఉదయం పడ్డ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాశాలలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ట్రాఫిక్ జాంలతో ఇక్కట్టు పడుతుండగా.. వర్షం కారణంగా వినాయక చవితి సెలవులకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత రాత్రి సర్దార్ మహాల్ లో 6.6 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ 6.3, శేరిలింగంపల్లి 5.7, బహదూర్‌పురా 5.0, మైత్రివనంలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని తోడేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. వర్షాకాల అత్యవసర బృందాలు, డిజాస్టర్ రెస్య్కూ బృందాలను అప్రమత్తం చేశారు.