హైదరాబాద్ నగరం అనుకోకుండా వచ్చిన భారీ వర్షంలో తడిసి ముద్దైంది. అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ స్థాయిలో కురిసిన వర్షం కారణంగా భాగ్యనగరం బెంబేలెత్తిపోయింది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరులో కురిసిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేసింది. మోండా మార్కెట్, బేగంపేట్, రసూల్‌పురా, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, అడ్డగుట్ట, కార్ఖానా, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సనత్‌నగర్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సంతోష్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదాపేట, సరూర్‌నగర్, చిలకలగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, లాలాపేట్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, బషీర్‌బాగ్, అబిడ్స్, లక్డీకాపూల్, సుల్తాన్ బజార్, నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిటీలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. హైదరాబాద్ వెలుపల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోనూ భారీ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల ఈదురు గాలులకు చెట్లు నేలకూలడంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.